గుండ్లకమ్మ నదీతీర గ్రామమైన చేకూరపాడు లో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామి పేరు మీద నామకరణం చేసి ప్రకాశం జిల్లాలోనే ఆవిర్భవించిన మొట్టమొదటి ఎయిడెడ్ సంస్కృత పాఠశాల. ప్రపంచ ప్రాచీన భాషలలో ప్రాచుర్యం పొందిన సంస్కృత భాషను ప్రధాన సబ్జెక్టుగా స్థాపించిన శ్రీ వేణుగోపాలస్వామి సంస్కృత ఉన్నత పాఠశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోనే గుర్తింపు పొందినది. అప్షనల్ సబ్జెక్టులు సంస్కృతం-తెలుగు, కంపోజిట్ మ్యాథ్స్-జనరల్ మ్యాథ్స్, సైన్స్,సోషల్ ప్రధాన బోధనాంశాలుగా ఉండేవి. నిష్ట్నాతులైన ఉపాధ్యాయల బృందం విద్యార్థులకు కఠినమైన పాఠ్యప్రణాళికల ద్వారా విద్యాబోధనతో పాటు, సమయపాలన, ఓర్పు, సహనం, సమాజముపట్ల గౌరవమర్యాదలు, విద్యార్థుల పట్ల స్నేహపూర్వక పోటీతత్వం, వసుదైక కుటుంభమనే భావంతో భవిష్యత్ కు భరోసా కలిగించేవారు. ఉన్నత విద్య కొరకు చదలవాడ మద్దిరాలపాడు, వలేటివారిపాలెం, గుడిమెళ్లపాడు, త్రోవగుంట, చిర్వానుప్పలపాడు, ఇనమనమెల్లూరు, ముక్తినూతలపాడు,కరువది గ్రామాల నుండి పాఠశాలకు వచ్చి చదివిన విద్యార్థులు ఎందరో గర్వించదగిన స్థాయిలో పురోగతి సాధించేందుకు దోహదపడిన పాఠశాల ఘనకీర్తికి తార్కాణం. పాఠశాల ప్రక్కనే గల సుందరమైన చెరువు, సువిశాలమైన ప్రాంగణములొ అందమైన చెట్లు,వివిధ రకాల పూల మొక్కలతో పచ్చని ఆహ్లాదకర వాతావరణములో గురుకుల పాఠశాల అనే స్ఫురణ కలిగేది. పలు రకాల క్రీడా సౌకర్యాలు కలిగిన విశాలమైన మైదానం ఉండడం వలన విద్యార్థులు జిల్లా,రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని గెలుపొందడం పాఠశాలకే గర్వకారణం. విద్యార్థులకు నటనలో శిక్షణ ఇవ్వడం వలన పాఠశాలలో ఏర్పాటైన కళావేదికపై ప్రదర్శించిన నాటకాల ద్వారా మన్నలు పొందటమేగాక టీవీ,సినీ రంగాలలో పేరు ప్రఖ్యాతులు గడించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు పొందారు.